*రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి*
*రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి*
*రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
*పట్టణంలో గొడవలు జరిగితే కఠిన చర్యలు*
*జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు*
*రాయచోటి, డిసెంబర్ 7:-*
రాయచోటి పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెలిగి ఎటువంటి గొడవలకు చోటు ఇవ్వరాదని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...రాయచోటి పట్టణంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న గొడవలను దృష్టిలో ఉంచుకొని హిందూ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో హిందూ ముస్లింలు ఒకరికొకరు సోదర భావంతో మెలగాలని ఎటువంటి కండిషన్లు లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు.
ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజులలో ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం తరపున గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఇందుకు సంబంధించి నాలుగైదు రోజుల తర్వాత రెండు వర్గాల మత పెద్దలను పిలిపించి మరొక పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పీస్ కమిటీ సమావేశంలో ఇకనుంచి పట్టణంలో ఎటువంటి గొడవలకు తాగు లేకుండా శాశ్విత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.... రాయచోటి పట్టణంలో ఎటువంటి గొడవలు జరిగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో కొంతమంది ఆకతాయిలు గొడవలు సృష్టిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 10:30 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులలో తప్ప అనవసరంగా ఎవరు బయట తిరగకూడదన్నారు. రాయచోటి పట్టణం ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడం జరిగిందన్నారు. పట్టణంలో ఎటువంటి చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments