తిరుపతి :
గోల్డ్ రింగ్ చోరీ కేసులో నిందితుడుగా.. CI మహేశ్వర్ రెడ్డి(A2)
తిరుపతిలో ఓ ఖరీదైన ఉంగరం దొంగతనం కేసులో ఏకంగా సీఐని నిందితుడిగా చేర్చిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బంగారంతో చేసిన ఆ ఉంగరం బరువు ఏకంగా 36 గ్రాములు.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఫోటోలతో ఆ ఉంగరాన్ని 36 గ్రాముల బంగారంతో తయారు చేయించారు.
ఆ ఉంగరాన్ని టీడీపీ నాయకుడు జయరామి రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ నెలలో తిరుపతిలోని ఓ రెస్టారెంట్ లో పోగొట్టుకున్నారు.
వెంటనే జయరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
రెస్టారెంట్ లోని ఓ కార్మికుడు దానిని తీసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు.
సాక్షాధారాలతో సహా తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని బాధితుడు జయరామిరెడ్డి అప్పగించారు.
బాధితుడిని విచారణ పేరుతో మూడు రోజులపాటు స్టేషన్ చుట్టూ తిప్పుకొన్న సీఐ.. అతనిపై కేసు నమోదు చేయకుండా వదిలేశారు.
కేసు నమోదు చేయకపోవటంపై ప్రశ్నిస్తే చంద్రబాబు, లోకేష్ ఫోటోలు ఉన్నాయి కనుక పట్టించుకోలేదని.. ఎవరు కేసు నమోదు చేస్తారంటూ సీఐ మహేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు జయరామిరెడ్డి తెలిపారు.
దీంతో జిల్లా ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని అన్నారు.
కేసు నమోదు చేయకపోగా నిందితుడ్ని వదిలివేయడంతో కోర్టులో ప్రైవేట్ గా పిటిషన్ వేశానని బాధితుడు జయరామిరెడ్డి తెలిపారు.
కేసు నమోదు చేయకపోవడంతో పాటు నిందితుణ్ని వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. సీఐ మహేశ్వర్ రెడ్డిని ఏ2 గా కేసులో చేర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వార్త పోలీస్ శాఖలో సంచలనంగా మారింది.
0 Comments