*నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట*
*పకడ్బందీగా స్కిల్ సెన్సెస్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు*
*స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష*
అమరావతిః రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కిల్ సెన్సెస్ లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఏపీఎస్ఎస్ డీసీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి, మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇందుకోసం అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాలను పరిశీలించాలని సూచించారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ఈ సమీక్షలో స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ రాజబాబు, డీఈటీ నవ్య, సీఈవో సీడ్ యాప్ శ్రీనివాసులు, ఏడీజీ న్యాక్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments